నాకు చిన్నపటి నుంచి చదవటం పెద్హగా అలవాటు లేదు , అంతగా ఇష్టం కూడా లేదు. కనీసం వార్తా పత్రికలు కూడా ఎప్పుడు చదవ లేదు.
ఎప్పుడయినా ఏదయినా చదివాను అంటే అది సినిమాల గురుంచే . (తరగతి పుస్తకాలు కాకుండా, అంటే వీటిని ఎలాగు చదవకుండా తప్పించుకోలేముగా మరి ! :) ), ఇంకా చిన్నప్పుడు సినిమా బొమ్మలు పోగు చేసే అలవాటు కూడా వుండేది. సినిమా బొమ్మల్ల కోసం సినిమా పేపరు వరకు ఎక్కడయినా సంపాదించే వాడ్ని. అంతకు మించి పుస్తకాలకు మనకు పెద్హగా అనుబంధం అంటూ ఏమి లేదు, అయిన తరగతి పుస్తకాలే చదవ లేక చస్తుంటే ఇంకా బయటి పుస్తకాలు కూడానా? :)
ఎంతో మందికి చిన్నపట్నుంచి పుస్తకాలు చదివే అలవాటు వుంటుంది కాని, నాకు మాత్రం పుస్తకాల అలవాటు డిగ్రీ లోకి వచ్చాకే కలిగింది , అది కూడా కొన్ని చిత్రమైన పరిస్థితుల్లో, మాది గుంటూరు జిల్లాలో నంబూరు అనే ఒక గ్రామం. కాని కొన్ని అనివార్య పరిస్థితుల్లో నేను డిగ్రీ వైజాగ్ లో చదవాల్సి వచ్చింది . అప్పట్లో మాకు కాలేజీ రోజుకు 4 గంటలు మాత్రమే వుండేది. ( అబ్బో అంత సేపు క్లాస్స్లో కుర్చోవటమే ఎక్కువ.) ఇంకా మిగతా సమయమంతా కాలీనే. రూములో ఉన్నంత వరకు క్యారమ్స్ , పేక మరియు T.V ఇవే కాలక్షేపం. బయట ఉన్నంత వరకు ఉంటే రామకృష్ణ బీచ్లో లేకపోతే సినిమా హాల్లో. వీటన్నిటితో మొదటి రెండు సంవత్సరాలు బాగానే కాలక్షేపం అయ్యింది. మూడవ సంవత్సరంలో రూము మారటంతో కాలక్షేపల్లన్ని ఎగిరి పోయాయి. రూం లో ఎక్కువ సేపు వుండటం వల్ల బాగా బోర్ కొట్టేది.
కొత్త రూములో రెండే రెండు కాలక్షేపాలు.ఒకటి సినిమా, వారానికి కనీసం ౩ సినిమాలయినా చూసే వాడ్ని. కొన్ని కొన్ని సార్లు రొజూ సినిమాకి వెళ్ళేవాడ్ని. డబ్బులు ఎలాగంటారా మనం వెళ్ళేది బెంచికే కదా. ఇక రెండవ కాలక్షేపం విశాఖ FM. ప్రతి ప్రోగ్రామ్ని బాగా ఫాలో అయ్యేవాడ్ని.
అయిన సరే రోజులో చాల టైం బోర్ కొట్టేది. ఇక కాలక్షేపానికి రూమ్లో ఎక్కడ పేపర్ కనిపించిన చదివేవాడ్ని . అప్పట్లో మా రూమ్మేట్ స్వాతి అంటే పడి చచ్చేవాడు (అమ్మాయి అనుకునేరు ,కాదు కాదు అది వార పత్రిక ) . నేను కూడా అప్పుడపుడు ఆ వార పత్రికని చదువుతూ వుండేవాడ్ని. అబ్బో అప్పట్లో అది ముందు ఎవరు చదవాలి అనే దాని మీద చిన్నపాటి యుద్హాలే జరిగేవి. మరి స్వాతికి అందరము ఫాన్సేగా. :):) ఇక అప్పట్నుంచి చదవటం మీద మెల్లిగా ఇష్టం పుట్టింది. స్వాతిలో నవలలూ అన్ని బాగా ఫాలో అయ్యేవాడ్ని.
వైజాగ్ లో ఒక సారి మా బందువుల సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు , ఆ పక్కన మెడికల్ షాప్ యజమాని శివ ఖేరా రచించిన "You Can Win " తెలుగు అనువాదపు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పారు. నేను ఒక వారంలో చదివి మరలా పుస్తకం ఆయనకు ఇచ్చేశాను. నేను జీవితంలో చదివిన మొట్టమొదటి పుస్తకం ఇదే. పుస్తకం చాల నచ్చింది. పుస్తకంలోని విషయం కన్నా పుస్తకం చదువుతున్న అనుభూతి నచ్చింది. అయిన అప్పట్లో మనకు personality development మీద పెద్హగా ఆసక్తి లేదు, దాని గురుంచి అంతగా తెల్సింది కూడా ఏమి లేదు.
ఇక అప్పట్నుంచి నేను కూడా పుస్తకాలు చదవటం మొదలు పెట్టాను. అన్నీ తెలుగు పుస్తకాలే. కాలక్షేపం కోసం పుస్తకాలు చదవటం మొదలు పెట్టినా, ఆ తరువాత అదో మంచి అలవాటుగా మారింది.
తెలుగు తో పాటుగా ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఎప్పుడు, ఎలా చదవటం మొదలు పెట్టానో తరువాత చెప్తాను. :)
-ఇంకా వుంది. :)

