ఎన్నో రోజుల నుంచి బ్లాగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నా, కానీ ఏమి రాయాలి మరియు దేని గురుంచి రాయాలి అని కొద్దిగా సంశయం,
చినపట్నుంచి నాకు తెలిసిన ఒక ముఖ్యమయిన పదం "నేను", అన్నిటికి 'నేను' లేదా 'నా' అనే ఆలోచించే వాడ్ని. అలానే నాకున్న చిన్ని ప్రపంచంలో హాయిగా 'నా' మరియు 'నేను' అనుకుంటూ బ్రతుకుతూ వుండేవాడ్ని. నాకు ముందు నుంచి అందరితో అన్ని పంచుకునే అలవాటు లేదు. చాలా కొద్ది విషయాలు మాత్రమే ఇతరులతో పంచుకునేవాడిని. అది అమ్మయిన , నాన్నయిన , అక్కయ్యలియిన మరియు స్నేహితులయినా. చాలా విషయాలు నా మనసులోనే ఉంచుకునే వాడిని. ఈ విషయం వారికీ కూడా తెలియదనుకుంటా. నాకు తెలిసినంత వరకు, దీనికి కారణం ఎవరితో కూడా ఎప్పుడు అంత మంచి అనుబంధం లేక పోవడమే, అలా అని వాళ్ళకి నాకు పడేదని కాదు అర్ధం, కానీ ఎందుకో ఎప్పుడు ఎవరికీ అన్ని చెప్పుకోవాలనిపించ లేదు. ఇప్పటికి కూడా అందరితో అన్ని పంచుకోవటం లేదు. ఇదే ఆలోచన విధానం నాకు మొదటి నుండి అలవాటయి పోయింది. ఇప్పుడు కూడా నా గురుంచి పూర్తిగా ఎవరికీ ఎప్పుడు ఏమి చెప్పుకోలేదు. ఎవరితో అయిన మాట్లాడటానికి కుర్చునపుడు ముందుగా నా నుంచి వచ్చే వాక్యం "ఏముంది చెప్పటానికి?" అని. కానీ కొంత మంది మాత్రం ఎప్పుడు ఆపకుండా ఏదో ఒకటి చెప్తూనే వుంటారు. పంచుకోవాలని అనుకునేవాళ్ళకు ఎప్పుడూ ఏదో ఒక విషయం వుంటుంది అనుకుంట చెప్పటానికి, కానీ అలాగే పంచుకోకుడదు అనుకునే వారికీ ఎప్పుడూ ఏమి ఉండదు అనుకుంట చెప్పటానికి.
ఎప్పుడూ అయిన ఏదయినా చెప్పాలనుకుంటే లేక ఏదయినా బాధలో వుంటే, అతి కోద్హి సందర్బాలలో, కాగితం మరియు కలం అందుకని ఆ విషయాన్నీ నాకు అర్ధమయిన బాషలో రాసుకొని , ఆ బాధ నుంచి ఉపశమనం పొందే వాడ్ని, ఆ తరువాత ఆ కాగితాలు చెత్త కుండీలో పడేసేవాడ్ని. అలా అని నేను బాగా రాయగలను అని కాదు , కానీ నాకు అర్ధమయ్యే బాషలో రాసుకొనే వాడ్ని. ఇప్పటికి కూడా ఈ పద్ధతినే పాటిస్తునాను. కాని ఈ మధ్య బ్లాగ్లో రాసుకుందామని అనిపించి ఈ బ్లాగ్ ఒకటి మొదలు పెట్టాను. కానీ ఇక్కడ నేను కొంత వరకే నా బావాలని వ్యక్త పరచగలను. అయిన మొదలు పెట్టేసాను. ఎప్పుడయినా ఏదయినా రాయాలనిపిస్తే రాస్తాను, లేక పోతే నా పాత పద్ధతినే పాటిస్తాను.
